శ్రీ తాళ్లపాక అన్నమయ్య వర్ణనా వైచిత్రి నిరుపమానమని, సరళమైన సంస్కృతంలో తెలుగు వారికి అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించినట్లు ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ హైస్కూల్ అధ్యాపకులు శ్రీమతి సుహాసిని పేర్కొన్నారు. అన్నమయ్య 522వ వర్థంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం సాహితీ సదస్సులు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆచార్య సుహాసిని 'అన్నమయ్య సంకీర్తనలు - సంగీతం' అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య అలతి అలతి పదాలతో దాదాపు 80 సంకీర్తనలను సంస్కృతంలో రచించినట్టు తెలిపారు. సంస్కృత కవులకు తెలుగు భాష రాకపోయినా పరవాలేదని, తెలుగు కవులకు మాత్రం తప్పకుండా సంస్కృతం తెలిసి ఉండాలన్నారు. అన్నమయ్య పద ప్రయోగ నిపుణత అనితర సాధ్యమన్నారు. శరణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని చెప్పారు. యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వేంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తిని చాటారని ఆయన వివరించారు. యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు.
తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు శ్రీ దామోదర నాయుడు " అన్నమయ్య - శ్రీ వేంకటేశ్వర శతకం " అనే అంశంపై మాట్లాడుతూ అన్నమయ్యకు పద్యం రాయగలిగిన పాండిత్యం ఉన్నా సామాన్య ప్రజల స్థాయిని దృష్టిలో ఉంచుకుని పదకవిత్వానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఈ శతకంలోని అన్నమయ్య పద్యశైలి, సొబగులు అద్భుతమని తెలియజేశారు.
అనంతరం గుంటూరు జిల్లా లేమల్లపాడు యం.టి.ఎస్ పాఠశాల డా.రవికృష్ణ " శ్రీ వేంకటేశ పదములలో విశేషాంశములు " అనే అంశంపై ఉపన్యసిస్తూ, శరణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని చెప్పారు. యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వేంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తిని చాటారన్నారు. అన్నమయ్య జీవిత విశేషాలను పరిశీలిస్తే తెలుగునాట భాగవత శిఖామణులుగా, భాగవతోత్తములుగా గుర్తింపు పొందారని వివరించారు.
అంతకుముందు ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ మధు సూదనరావు బృందం సంగీత సభ నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రంగనాథ్ బృందం సంగీత సభ, రాత్రి 7 నుండి 8.30 గంటలకు వరకు తిరుపతికి చెందిన శ్రీమతి మంజుల బృందం హరికథ గానం నిర్వహించనున్నారు.
తాళ్ళపాక ధ్యానమందిరం......
తాళ్ళపాక ధ్యానమందిరం వద్ద గురువారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీమతి కవిత, శ్రీ బాలాజి బృందం సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ శ్రీనివాస్ బృందం హరికథ గానం చేయనున్నారు.
అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద......
రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద గురువారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి విజయలక్ష్మీ, శ్రీ శ్రీనివాస కుమార్ బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారు. రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి రమ్యకృష్ణ బృందం హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment