తిరుమల
శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. శనివారం ఉదయం ఆయన తిరుమలలోని శిలా తోరణం వద్ద నుండి దర్శన క్యూలైన్లలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని చాలా వరకు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్యూలైన్లలో పలు మార్పులు చేపట్టామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
భక్తుల కొరకు మొబైల్ వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లు
చలికాలం కావడంతో క్యూలైన్లలోని అన్న ప్రసాదాల పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు చల్లబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తుల కోసం టీటీడీ అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించుకునేందుకు వివిధ భాషల్లో సూచిక బోర్డులను కూడా క్యూలైన్లలో మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. భక్తులందరూ టీటీడీ క్యూలైన్లలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని సంయమనంతో స్వామివారిని దర్శంచుకోవాలని తెలియజేశారు.
ఈ తనిఖీల్లో అదనపు ఈవో వెంట శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, అన్న ప్రసాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఈఈ శ్రీ శ్రీనివాసులు, డిఈ శ్రీ చంద్రశేఖర్, ఐటీ డిప్యూటీ జీఎం శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, అశ్వని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి, పలువురు విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డిసెంబర్ 28 నుండి జనవరి 7వ తేది వరకు SSD టోకెన్లు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుండి జనవరి 7వ తేది వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే SSD టోకెన్ల జారీని రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలు
30.12.2025 నుండి 08.01.2026 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు.
తొలి మూడు రోజులు అనగా, డిసెంబర్ 30, 31 మరియు జనవరి 01వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం.
టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి (Time Slot) మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
టీటీడీ ప్రజా సంబంధాల విభాగం, SVBC, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పపడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకన్లు లేని భక్తులు జనవరి 02వ తేదీ నండి 08వ తేదీ వరకు సర్వ దర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించుకోవలసినదిగా కోరడమైనది.
No comments:
Post a Comment