టిటిడి
ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శ్రవణం సంస్థలో శిక్షణ పొందుతున్న చిన్నారుల పురోగతి దశలపై ఛార్ట్ లు రూపొందించాలని టిటిడి జేఈవో (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్) డా. ఎ. శరత్ అధికారులకు సూచించారు. శ్రవణం ప్రాంగణాన్ని బుధవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, వినికిడి లోపం గల పిల్లలు శ్రవణంలో చేరగానే వీడియో రికార్డ్ చేసి, తదుపరి శిక్షణ, శిక్షణ అనంతరం వెలుపలికి వెళ్లే అంశాలను వీడియో తీసి పిల్లల సంరక్షకులకు ఇస్తే వారిలో మరింత ఆనందం కన్పిస్తుందని ఆయన అధికారులకు సూచించారు. 0 - 5 వయసు పిల్లలకు శిక్షణలో వివిధ దశల పురోగతి కనిపించేలా శ్రవణం ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి దీవెనలతో శ్రవణం సంస్థ నడుస్తోందని వారికి ఆధునిక పద్దతుల ద్వారా మరింత ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ సూచనలతో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ముందుగా శ్రవణంలో పిల్లలకు శిక్షణ, ఏర్పాట్లు, సదుపాయాలను ఆయన పరిశీలించారు. శిక్షణలో ఉన్న పిల్లలతో ముచ్చటించారు. పిల్లలకు బోధిస్తున్న బోధనా పద్దతులను దగ్గరుండి పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మరింత సరళమైన పద్దతుల ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించారు. శ్రవణంలో చేరాక పిల్లల మాటల ఉచ్చరణ, మాటలను అర్థం చేసుకునే సామర్థ్యంలో పురోగతి ఉందా అని తెలుసుకున్నారు. పిల్లలకు శిక్షణ చాలా బావుందని వారి తల్లులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తరగతి గదులలో ఆధునిక వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డే స్కాలర్ పిల్లలకు మధ్యాహ్న భోజనం సదుపాయం, శిక్షణ పూర్తి అయ్యాక ఆధునిక వినికిడి పరికరాలు అందించే అంశం, మెరుగైన బోధనాంశాలు, బోధనా పద్దతులు, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలు తదితర అంశాలపై డిఈవో శ్రీ టి. వెంకట సునీల్ టిటిడి జేఈవోకు నివేదించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్, శ్రవణం ప్రాజెక్ట్ ఏఈవో శ్రీమతి అమ్ములు, డిఈ శ్రీమతి సరస్వతి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment