తిరుపతిలోని
ఎస్వీ హైస్కూల్ పాత భవనాన్ని టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ భవనంలో 2006 సంవత్సరం వరకు ఎస్వీ హైస్కూల్ నిర్వహించబడింది. అనంతరం 2010లో ఈ భవనాన్ని పోలీస్ శాఖకు అప్పగించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయం కొత్త భవనానికి మారినప్పటికీ, ప్రస్తుతం ఈ భవనంలో పోలీస్ క్యాంటీన్, పోలీస్ సంక్షేమ శాఖ కొనసాగుతున్నాయి.
ఇటీవల కొందరు భక్తులు టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్రకు ఈ భవనంపై ఫిర్యాదు చేయడంతో, దాదాపు 150 ఏళ్ల చరిత్ర గల ఈ భవనాన్ని టిటిడి తిరిగి స్వాధీనం చేసుకుని హైస్కూల్‌ను పునఃప్రారంభించాలనే సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవనాన్ని పరిశీలించాలని జేఈవోకు ఆదేశాలు ఇచ్చారు.
దీనిపై స్పందించిన జేఈవో భవనాన్ని పరిశీలించి, పోలీస్ శాఖ నుండి వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అలాగే భవనాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరమ్మత్తులు చేపట్టడం, పచ్చదనం పెంపు, పెయింటింగ్, గదుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ, డీఈవో శ్రీ వెంకటసునీల్, ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment