ఆధ్యాత్మికత
, శిల్పకళ, శాస్త్రజ్ఞానంతో నిండిన పవిత్ర క్షేత్రం నాగలాపురం. ఇక్కడ విరాజిల్లుతున్న శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మికతను మరింత ప్రసాదించే దివ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పౌరాణిక వైభవంతో మరింతగా భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ జరుగుతున్న పూజలు, సేవలు భక్తుల్లో భక్తి భావాన్ని మరింతగా పెంపొందిస్తున్నాయి.
మత్స్యావతార మహిమ
సోమకాసురుడు వేదాలను అపహరించగా లోకం అజ్ఞానాంధకారంలో మునిగిపోయింది. దేవతల ప్రార్థనలతో శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి అసురుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేశాడు. ఆ దివ్య ఘట్టం జరిగిన ప్రదేశమే నాగలాపురమని భక్తుల విశ్వాసం. మహాలక్ష్మి, పరమేశ్వరుడు మత్స్యరూపంలోని శ్రీహరిని దర్శించారని చెప్పబడటంతో ఈ క్షేత్రం “హరికాంతపురం”గా ప్రసిద్ధి చెందింది.
శిల్పకళా వైభవం
పంచప్రాకారాలు, సప్తద్వారాలు, నాలుగు వైపులా గోపురాలతో ఆలయం అద్భుతంగా నిర్మించబడింది. పల్లవుల నిర్మాణ శైలి, శ్రీకృష్ణదేవరాయల అభివృద్ధి కలగలసి ఈ ఆలయాన్ని విశిష్టంగా నిలబెట్టాయి. నాలుగు ద్వారాలకు విభిన్న ద్వారపాలకులు ఉండటం అరుదైన విశేషం. ఉప ఆలయాల్లో లక్ష్మీనరసింహ, కోదండరామ, హయగ్రీవ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
సూర్యకిరణాల అద్భుతం
ప్రతి సంవత్సరం సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్‌ను తాకడం ఈ ఆలయ విశేషం. పాదాలు, నాభి, శిరస్సును వరుసగా స్పృశించే ఈ దివ్య దృశ్యం శిల్పవిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ఘట్టాన్ని “సూర్యపూజోత్సవం”గా భక్తి భరితంగా నిర్వహిస్తారు.
దివ్య దర్శనం
మత్స్యనారాయణ స్వామివారి దర్శనం కేతు దోష నివారణకు, విద్యాభివృద్ధికి శ్రేయస్కరమని భక్తులు విశ్వసిస్తున్నారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో శరణు కోరిన వారికి శత్రు బాధలు తొలగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.
నిత్య కైంకర్యాలు
ప్రతి రోజు నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదం అందిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాదం నిర్వహించబడుతూ భక్తులకు ఆధ్యాత్మిక తృప్తిని అందిస్తోంది.
ఉత్సవాల వైభవం
ప్రతి శనివారం అభిషేకం, సంవత్సరంలో సూర్యపూజోత్సవాలు, తెప్పోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పుష్పయాగం, పవిత్రోత్సవాలు భక్తి పరవశంలో నిర్వహించబడుతున్నాయి. మత్స్యజయంతి సందర్భంగా మత్స్యకారులు దీక్షలతో స్వామివారిని దర్శించుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఆధ్యాత్మిక వారసత్వానికి చిరునామా
1967లో టిటిడిలో విలీనం అయిన ఈ ఆలయం అప్పటి నుండి టీటీడీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతోంది. 1971, 2008లో మహాసంప్రోక్షణలు నిర్వహించగా, 2026 ఫిబ్రవరిలో మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ పరిసరాల్లో రామాయణం, మహాభారతం, మత్స్యావతార ఘట్టాలను ప్రతిబింబించే అద్భుత శిల్పాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయి.
No comments:
Post a Comment