శ్రీవారి
ప్రసాదాల తయారీ, పంపిణీ ప్రక్రియలో అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత, పోషక విలువలను నిర్ధారించడంతో పాటు వాటి సంప్రదాయ స్వరూపాన్ని పరిరక్షించేందుకు టీటీడీ, మైసూరుకు చెందిన CSIR-Central Food Technological Research Institute తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
బెంగళూరులో నిర్వహించిన రెండు రోజుల RISE Conclave-2026 (Reasearch, Innovation, Start-ups And Entrepreneurship) సదస్సులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సదస్సులో టీటీడీ తరఫున ప్రోక్యూర్మెంట్ జీఎం శ్రీ ఉమా శంకర్ పాల్గొన్నారు. కాగా, దేశంలోని దేవాలయాలకు సంబంధించి ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరిశోధనలు, ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని, తయారీ సామర్థ్యాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ఒప్పందం ద్వారా కలిగే ప్రయోజనాలు
• నాణ్యత, భద్రతకు మరింత ప్రాధాన్యం:
ముడి పదార్థాల కొనుగోలు నుంచి ప్రసాదాల తయారీ, పంపిణీ వరకు కఠినమైన నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక విధానాలు అమలు చేస్తారు.
• ఆధునిక నిల్వ, పరీక్షా వ్యవస్థలు:
నిల్వ, కొనుగోలు, పరీక్షల ప్రక్రియల్లో శాస్త్రీయంగా నిర్ధారిత సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టి కలుషిత ప్రమాదాలను తగ్గిస్తారు.
• ప్రసాదాల నిల్వ కాలం పెంపు:
రుచి, నాణ్యత, సంప్రదాయ విలువలకు భంగం కలగకుండా ప్రసాదాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్యాకేజింగ్, పరిశోధన చర్యలు చేపడతారు.
• సిబ్బందికి ప్రత్యేక శిక్షణ:
టీటీడీ ఆహార విశ్లేషకులు, సంబంధిత సిబ్బందికి ఆధునిక పరీక్షా విధానాలు, నమూనాల సేకరణ, కలుషిత పదార్థాల గుర్తింపు, నెయ్యి స్వచ్ఛత నిర్ధారణ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తారు.
• శాస్త్రవేత్తల ప్రత్యక్ష సహకారం:
సీఎస్‌ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్తలు టీటీడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించి సాంకేతిక సూచనలు, పరిశోధన ఆధారిత సహకారం అందిస్తారు.
ఈ ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాల నాణ్యత, భద్రత, పోషక విలువలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు భక్తులకు మరింత విశ్వసనీయమైన సేవలు అందించే అవకాశం కలుగనుంది.
No comments:
Post a Comment