7.7.26

హనుమంత వాహనంపై భక్తులను అనుగ్రహించిన శ్రీ సుందరరాజస్వామివారు hanumath vahanam





తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి శ్రీ సుందరరాజస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో దివ్య మంగళ విహారం చేసి భక్తులకు అభయప్రదమైన దర్శనమిచ్చి అనుగ్రహించారు.

శాస్త్రోక్తంగా అభిషేకంవైభవంగా ఊంజల్ సేవ

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనం తదితర పవిత్ర ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా మహాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించిన అనంతరం, హనుమంత వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.

మంగళవారం గరుడ వాహనసేవ

అవతార మహోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి శ్రీ సుందరరాజస్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment