3.7.26

గోవింద నామస్మరణతో వైభవంగా రథోత్సవం rathotsavam







అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రిగిన రథోత్సవం భక్తి పారవశ్యంతో, వేదఘోషలు, మంగళవాయిద్యాలు, గోవింద నామసంకీర్తనల మధ్య అత్యం వైభవంగా జరిగింది.

ఉదయం 8 గంటలకు స్వామివారు రథారోహణం చేయగా, ఉదయం 8.45 గంటల నుండి 10.15 గంటల వరకు నాలుగు మాడవీధుల్లో దివ్య విహారం చేస్తూ వేలాది మంది భక్తులకు అభయప్రద దర్శనం ఇచ్చారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.

రథోత్సవ తాత్పర్యం

రథోత్సవం ఆత్మతత్త్వాన్ని బోధించే మహోన్నత ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. ఆత్మ రథికుడు, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు వీధులుగా భావించే ఈ ఉపమానం ద్వారా ఆత్మ–అనాత్మ వివేకాన్ని గ్రహించే అవకాశం కలుగుతుందని ఆగమ శాస్త్రాలు వివరిస్తాయి.

వేడుకగా స్నపన తిరుమంజనం

రథోత్సవం అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు శ్రీ స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీటితో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

సాయంత్రం అశ్వవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.

జూలై 3 చక్రస్నానం

బ్రహ్మోత్సవాల చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్‌వారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10.30 నుండి 10.45 గంటల వరకు ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుండి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, ఎస్‌ఈ శ్రీ నరసింహమూర్తి, ఏఈవో శ్రీ దేవరాజులు, డిప్యూటీ ఈఈ శ్రీ రామ్మూర్తి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఏఈ శ్రీ సురేష్‌రెడ్డి తదితర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment