ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు భక్తిరసంతో నిండిపోయింది.
అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
పురాణాల ప్రకారం జలప్రళయం సంభవించినప్పుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు.
కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆనందంగా కనిపిస్తారు. ఆ దివ్యరూపాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు.
భక్తుల కష్టాలను తొలగించి రక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా సందేశం ఇస్తున్నారని పండితులు తెలిపారు. వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో కూడా విశేషంగా వర్ణించారు.
ఈ వాహనసేవలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు, అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.









No comments:
Post a Comment