ఒంటిమిట్ట
శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి భక్తులకు విశేషంగా అన్నప్రసాదాలను అందించి తన సేవా స్పూర్తిని మరొకసారి చాటుకుంది. ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా 1.25 లక్షల పైచిలుకు భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేయడం విశేషం.
శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు ఒంటిమిట్టకు తరలివచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందేలా టిటిడి సమగ్ర ఏర్పాట్లు చేసింది. ఆలయ సమీపంలోని అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటు కల్యాణ వేదిక వద్ద ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రాన్ని ఏర్పాటు చేసి సమర్థవంతంగా పంపిణీ చేశారు.
కల్యాణోత్సవం రోజున భక్తులకు పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, కారాలు, బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు, వాటర్ బాటిల్, టెట్రా ప్యాకెట్, మజ్జిగలను ఒకే బ్యాగ్‌లో అందజేసి సౌకర్యవంతమైన సేవను అందించారు.
అదేవిధంగా బ్రహ్మోత్సవాల మొత్తం కాలంలో ప్రతిరోజూ భక్తులకు ఉదయం పొంగలి, ఉప్మా, సాంబర్, చట్నీ, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో అన్నం, చెక్కెర పొంగలి, కూర, చట్నీ, సాంబర్, రసం, మజ్జిగలను వడ్డించారు.
మార్చి 27 నుండి ఏప్రిల్ 5 వరకు రోజువారీగా వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించగా, వివరాల ప్రకారం — మార్చి 27న 30,700, 28న 22,900, 29న 23,900, 30న 22,300, 31న 26,500, ఏప్రిల్ 1న అన్నప్రసాదాలు 40 వేలు, కల్యాణోత్సవం సందర్భంగా గ్యాలరీలలో 85 వేల మంది, ఏప్రిల్ 2న 23,500, 3న 18,450, 4న 15,350, 5న 11,400 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు.
ఈ విధంగా మొత్తం 10 రోజుల్లో దాదాపు 3.20 లక్షల మంది భక్తులు టిటిడి అన్నప్రసాద సేవలను స్వీకరించారు.
భక్తుల సేవే పరమావధిగా టిటిడి నిర్వహించిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల ప్రశంసలను అందుకుంది.
No comments:
Post a Comment