7.8.25

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ Pavitra Samarpanam

















తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.


ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు, ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు,  డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా తొండ‌మాన్‌పురం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం tondamanpuram




తొండ‌మాన్‌పురం శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. 


ఉద‌యం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం చ‌తుష్ట‌ర్చ‌న‌, ప‌విత్ర ప్ర‌తిష్ట నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.

యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 09వ తేదీ పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. 

ఈ కార్యక్రమంలో సూప‌రింటెండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సుదీర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

6.8.25

Chiranjeevi Inaugurated Blood Donation Camp-02