చిత్తూరు జిల్లా గంగవరం (మం), కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మే 5 నుండి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఉదయం 8 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. గజేంద్ర, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ కోనేటిరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలకు మే 4న సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి.
రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
05-05-2025
ఉదయం - ధ్వజారోహణం (కర్కాటక లగ్నం- మధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంటల వరకు)
సాయంత్రం - పెద్ద శేష వాహనం
06-05-2025
ఉదయం - చిన్న శేషవాహనం
సాయంత్రం - హంస వాహనం
07-05-2025
ఉదయం - సింహ వాహనం
సాయంత్రం - ముత్యపుపందిరి వాహనం
08-05-2025
ఉదయం - కల్పవృక్ష వాహనం
సాయంత్రం - సర్వభూపాల వాహనం
09-05-2025
ఉదయం - మోహినీ ఉత్సవం
సాయంత్రం - శ్రీవారి కల్యాణోత్సవం, గరుడ వాహనం
10-05-2025
ఉదయం - హనుమంత వాహనం
సాయంత్రం - వసంతోత్సవం, గజ వాహనం
11-05-2025
ఉదయం - సూర్యప్రభ వాహనం
సాయంత్రం - చంద్రప్రభ వాహనం
12-05-2025
ఉదయం - రథోత్సవం
సాయంత్రం - అశ్వవాహనం
13-05-2025
ఉదయం - చక్రస్నానం
సాయంత్రం - ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.





No comments :
Write comments