అన్నమయ్య సంకీర్తనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్ అన్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 617 జయంతి వేడుకలు తిరుపతి అన్నమయ్య కళా మందిరంలో సోమవారం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. మేడసాని మోహన్ మాట్లాడుతూ అన్నమాచార్య కీర్తనల్లో యువతను భాగస్వామ్యం చేయాలని కోరారు. శ్రీవారి వైభవాన్ని తన కీర్తనల ద్వారా విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. అన్నమయ్య జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.
అంతకముందు ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల ఆధ్వర్యంలో సప్తగిరి కీర్తనల గోష్ఠిగానం చేపట్టారు. అనంతరం తిరుపతికి చెందిన శ్రీమతి జి.లావణ్య బృందం `హరిసర్వాత్మకుడు, ఇంకనైనా కరుణించవేమయ్యా, పలువిచారములేల, ఏవందర్శయసి తదితర కీర్తనలను సంగీత సభలో ఆలపించారు.
అనంతరం శ్రీమతి రెడ్డెమ్మ బృదం రాజసూయయాగం అనే హరికథను వినిపించారు. సాయంత్రం శ్రీమతి ఎస్.సుగుణమ్మ బృందం సంగీత సభ, తిరుపతికి చెందిన శ్రీమతి వనజ కుమారి బృందం హరికథను వినిపించనున్నారు.
తాళ్లపాకలో....
తాళ్లపాకలోని ధ్యానమందిరంలో ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీనివాసం కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సంగీత సభ, హరికథ కార్యక్రమాలు జరగనున్నాయి.
రాజంపేటలో...
రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం ఊంజల్ సేవ, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.







No comments :
Write comments