అన్నమయ్య అక్షర సరస్వతిని అశ్రయించి తన సంకీర్తనలతో సామాన్యులకు పరబ్రహ్మ స్వరూపాన్ని చూచిన అనుభూతి కల్పించారని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య చెన్నప్ప పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు బుధవారం నాలుగవ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య చెన్నప్ప " అన్నమయ్య సంకీర్తనలు - బ్రహ్మసాక్షాత్కారం " అనే అంశంపై ఉపన్యసిస్తూ, ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని చెప్పారు. భగవంతుని చేరడానికి భక్తి సులభమైనదన్నారు. వ్రతాలు, యగ్నయాగాలు తదితరవాటికి నియమాలు ఉంటాయని, కానీ భక్తికి ఎలాంటి నియమం ఉండవని తెలిపారు. భగవంతుని ప్రేమతో, భయంతో, స్నేహంతో, కోపంతో, ఎన్ని విధాలుగా ఆరాధించినా చేరుకోవచ్చని వివరించారు.
తిరుపతికి చెందిన విశ్రాంత ఆకాశవాణి సంచాలకులు శ్రీ మల్లేశ్వరరావు " అన్నమయ్య సంకీర్తనల్లో సామాజిక సందేశం " అనే అంశంపై మాట్లాడుతూ, కవి కూడా సమాజంలో భాగమేనని, సమాజాన్ని వదిలి సాహితీ రచన ఉండదని చెప్పారు. అప్పటి సమాజంలోని అనేక రుగ్మతలను బాహాటంగా విమర్శించి ప్రజల మన్ననలు చూరగొన్న ప్రజాకవి, అభ్యుదయ కవి, సంఘసంస్కర్త అన్నమయ్య అన్నారు.
నగరి ప్రభుత్వ డిగ్రీ మరియు పిజి కళాశాల అధ్యాపకులు శ్రీమతి వరలక్ష్మీ " అన్నమయ్య - తాత్త్వికత " అనే అంశంపై ఉపన్యస్తూ, వైరాగ్యం, విరక్తి, కోర్కేలు లేక పోవడం వంటి వాటిని ప్రభోదిస్తూ, ప్రజలను ఆధ్యాత్మికత, మోక్ష మార్గంలో నడేపేందుకు అన్నమయ్య సంకీర్తనను రచించిట్లు తెలిపారు. వేదాంతాన్ని భక్తి అనే రసగుళిక ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేసిన మహనీయుడు అన్నమయ్య అన్నారు. నామ సంకీర్తన, నామ జపంతో జాతి, కుల, మతాలకతీతంగా భగవంతుని చేరవచ్చని తెలిపారు. శ్రీవారిని సంకీర్తన ద్వారా సామాన్యులకు చేరువ చేసేందుకు అన్నమయ్య కృషి చేసినట్లు వివరించారు.
సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి సుశీల బృందం సంగీత సభ, రాత్రి 7 గంటలకు ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ శ్రీనివాస్ బృందం హరికథ గానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మహతి కళా క్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన కుమారి అనూష, కుమారి ఆర్తి బృందం సంగీత సభ, రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి అన్నపూర్ణ గాత్ర సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ మేడసాని మోహన్, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి లత, పెద్ద సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.





No comments :
Write comments