14.5.25

అన్నమయ్య సామాజిక కవి : ఆచార్య కె.సర్వోత్తమరావు annamaiah


















అన్నమయ్య సాహిత్యం విలక్షణమైందని, వారిని సామాజిక కవిగా, ఆలయకవిగా, అనుభూతి కవిగా పేర్కొనవచ్చని ఎస్వీయూ విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సర్వోత్తమరావు అన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంతి కార్యక్రమాలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు ఆచార్య సర్వోత్తమరావు అధ్యక్షత వహించారు . ఆయన "అన్నమయ్య పదాలలో గ్రామీణ చిత్రణ" అనే అంశంపై ప్రసంగిస్తూ, అన్నమయ్య తన సంకీర్తనల్లో గ్రామీణ జీవితంలోని మాధుర్యాన్ని, జానపదాలను, గ్రామాల్లోని సామెతలను, నానుడులను పొందుపరిచారని తెలియజేశారు.
సమాజ వికాసానికి అన్నమయ్య కీర్తనలు ఎంతో ఉపకరిస్తాయని చెప్పారు. తెలుగు కవులు ఎందరో అన్నమయ్య సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందారన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషా సాహిత్యాల్లో తగిన పరిజ్ఞానం కలిగి వైష్ణవ సంప్రదాయాలు తెలిస్తే గాని అన్నమయ్య సాహిత్యం అవగతం కాదన్నారు.
అన్నమయ్య వంశీయులు శ్రీ హరిహరాయణాచార్యులు "శ్రీవారి ఆలయం అన్నమయ్య సేవా కంకర్యాలు" అనే అంశంపై ప్రసంగిస్తూ, బాల్యం నుంచి శ్రీవారి పట్ల భక్తిని వెల్లడించిన భక్తుడు అన్నమయ్య అన్నారు. నేటికీ శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం తదితర సేవలను అన్నమయ్య ప్రవేశపెట్టారని చెప్పారు. దైవానికి తప్ప మరెవ్వరికీ తలవంచని ధైర్యం అన్నమయ్య సొంతమని, అన్నమయ్య వ్యక్తిత్వంలోని వివిధ ఉత్తమ కోణాలను వివరించారు.
తిరుపతికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు డాక్టర్ బత్తెల శ్రీరాములు "అన్నమయ్య సంకీర్తనలు వైష్ణవాచార్యులు" అనే అంశంపై ప్రసంగించారు . అన్నమాచార్యులు మోక్ష సాధన సామగ్రిలో భక్తిని ఉత్తమోత్తమంగా భావించారని తెలిపారు. భక్తిని, శరణాగతిని ఆలంబనగా చేసుకుని ఆధ్యాత్మికంగా పురోగమించడమే కాకుండా, తమ ఆధ్యాత్మిక కీర్తనలతో లోకానికి తరుణోపాయం చాటి చెప్పారని అన్నారు. నవవిధ భక్తిమార్గాలు, గీతాచార్యుని ఉపదేశాలను ప్రమాణంగా చేసుకుని ఆధ్యాత్మిక యానం సాగించారని వివరించారు.
సాయంత్రం 6 గంటల నుండి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి బుల్లెమ్మ బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తిరుపతికి చెందిన శ్రీ పురుషోత్తం బృందం హరికథ గానం చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ మేడసాని మోహన్, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి లత,ఇతర అధికారులు, విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

No comments :
Write comments