16.5.25

స్వామివారి నంద‌కాంసంగా జ‌న్మించిన సిద్ధ పురుషుడు అన్న‌మ‌య్య: శ్రీ కారుపోలు వెంక‌ట‌ప‌తి స్వామి








 సంకీర్త‌న‌ల ద్వారా ఓల‌లాడిస్తూ ఇటు భ‌క్తి ప్ర‌పంచానికి, అటు వాజ్ఞ్మ‌య ప్ర‌పంచానికి అనుశాస‌న‌క‌ర్త‌గా స్వామివారి నంద‌కాంసంగా జ‌న్మించిన సిద్ధ పురుషుడు అన్న‌మ‌య్య అని వైజాగ్ కు చెందిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌య విశ్రాంత ఉద్యోగులు శ్రీ కారుపోలు వెంక‌ట‌ప‌తిస్వామి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు సోమ‌వారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సంద‌ర్భంగా సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య శ్రీ కారుపోలు వెంక‌ట‌ప‌తిస్వామి `అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు-సంగీత సంప్ర‌దాయం ` అనే అంశంపై ప్ర‌సంగించారు.

చెన్నైకు చెందిన డి.జి.వైష్ణ‌వ క‌ళాశాల విశ్రాంత తెలుగు శాఖాధ్య‌క్షులు డాక్ట‌ర్ కాస‌ల‌ నాగ‌భూష‌ణం `అన్న‌మ‌య్య ప‌దాల‌లో క‌వితా లాలిత్యం అనే అంశంపై ఉప‌న్య‌సిస్తూ క‌విత్వ ప్ర‌శంస‌లో సాధార‌ణంగా క‌వితా మాధుర్యం, క‌వితా సౌంద‌ర్యం, క‌వితా సౌర‌భం అని చెబుతూ ఉంటార‌నీ, కానీ అన్న‌మ‌య్య ప‌ద క‌విత‌లో ఆ గుణాల‌తో పాటు లాలిత్యం కూడా గోచ‌రిస్తుంద‌ని తెలిపారు. వారి ప‌దాలు శృంగార భ‌క్తి ప్ర‌ధానంగా ఉండ‌డం వ‌ల్ల ఆ రెండు ర‌సాలు ల‌లిత‌మైన‌వి కావ‌డం వ‌ల్ల ఈ క‌వితా లాలిత్యం కూడా ప్ర‌స్ఫుటంగా గోచ‌రిస్తుంద‌ని అంటూ ఆయా స‌న్నివేశాల‌కు త‌గిన‌ట్లుగా సోదాహ‌ర‌ణంగా ప్ర‌సంగించి స‌భాస‌దుల క‌ర‌తాళ ధ్వ‌నుల్ని అందుకున్నారు.
శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం ప్రాచ్య ప‌రిశోధ‌నా సంస్థ అధ్యాప‌కులు డాక్ట‌ర్ పి.సి.వేంక‌టేశ్వ‌ర్లు `అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు-ఆచార వ్య‌వ‌హారాలు అంశంపై ప్ర‌సంగిస్తూ అన్నమాచార్యులు ఆల‌పించిన వేల సంకీర్త‌న‌ల్లో ఎన్నో సామాజిక అంశాల‌తో పాటూ, నాటి తెలుగు ప్ర‌జ‌ల ఆచార‌ వ్య‌వ‌హారాలు, న‌మ్మ‌కాలు క‌నిపిస్తాయ‌ని చెప్పారు.
శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు డాక్ట‌ర్ యువ‌శ్రీ `అన్న‌మ‌య్య‌-పోత‌న‌ల భ‌క్తిత‌త్వం అనే అంశంపై ప్ర‌సంగిస్తూ తెలుగు సాహిత్య చ‌రిత్ర‌లో 15వ శ‌తాబ్దానికి విశిష్ట‌మైన స్థానం ఉంద‌ని అన్నారు. ప‌దం బాల్యం, ప‌ద్యం య‌వ్వ‌నంగా క‌లిగిన ఈ శ‌తాబ్దానికి తండ్రి వైష్ణ‌వ‌మ‌ని పేర్కొన్నారు. త‌మ కాలంలో జ‌రిగిన అనేక సంఘ‌ట‌న‌ల‌కు క‌వులు ప్ర‌త్య‌క్ష సాక్షులుగా క‌నిపిస్తార‌ని, అలాంటి మ‌హాక‌వుల్లో పేరెన్నిక క‌లిగిన భ‌క్త క‌వులు అన్న‌మ‌య్య, పోత‌న‌లు అని తెలిపారు. సంకీర్త‌న‌ల ర‌చ‌న ద్వారా అన్న‌మ‌య్య‌, భాగ‌వ‌త ర‌చ‌న ద్వారా పోత‌న ప్ర‌శ‌స్తి పొందార‌న‌డం నిర్వివాదాంశ‌మ‌ని తెలియ‌జేశారు.
అనంత‌రం సాయంత్రం 6 గంట‌ల‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయ‌కులు శ్రీ వేద‌వ్యాస ఆనంద భ‌ట్ట‌ర్ బృందం సంగీత స‌భ‌, రాత్రి 7 గంట‌ల‌కు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి జి.అనురాధ బృందం హ‌రిక‌థ గానం కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి.

No comments :
Write comments