12.5.25

ధ్యానం చేసేవారికన్నా ధాన్యం తయారు చేసే వారే గొప్పవారు : ఆచార్య నల్లపరెడ్డి ఈశ్వర్ రెడ్డి





ధ్యానం చేసేవారికన్నా ధాన్యం తయారు చేసే వారే గొప్పవారని కడప యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు నల్లపరెడ్డి ఈశ్వర్ రెడ్డి మాట్లాడారు. తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో ఆదివారం జరిగిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాల సందర్భంగా 

ఆదివారం ఉదయం 10 గం. సాహితీ సదస్సు జరిగింది.
ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నృసింహ శతకం వైశిష్ట్యంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచనల్లో నీతి, భక్తి, నైతిక విలువలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. ప్రతి మనిషిలో దయ, శక్తి, నిజం మాట్లాడే స్వభావం ఉంటే, దేవుడు ఎక్కడో లేరని, అందరిలో కనిపిస్తారని, కనిపించే భౌతిక రూపంలో దేవుడు కనిపిస్తారనే భావన వెంగమాంబ రచనల్లో కనిపిస్తుందన్నారు. మనసు పవిత్రంగా ఉండేలా చూసుకోవాలని, మనిషిలో భగవంతుడిని చూసుకోవాలనే భావన నృసింహ శతకంలో కనిపిస్తుందన్నారు. ఈ శతకంలోని 103 పద్యాలలో కీ.శే శ్రీ కే జే కృష్ణ మూర్తి గారు 93 పరిష్కారం చూపగా 10 పద్యాలు మిగిలిపోయాయన్నారు. వాటిని పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా శ్రీ పద్మావతీ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా. వి. కృష్ణవేణి మాట్లాడుతూ, తిరుమలలో జీవ సమాధి కేవలం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారికే ఉందన్నారు. తరిగొండ వెంగమాంబ తాత్విక చింతన అనే అంశంపై మాట్లాడారు. వెంగమాంబ రాసిన చెంచు నాటకంలో స్త్రీ పాత్రనే ప్రధానపాత్ర పోషించే కథానాయికగా తీర్చిదిద్దారన్నారు. ఎన్నో అవమానీయ సంఘటనలు ఎదురైనా ఎక్కడా రాజీపడకుండా భక్తి మార్గాన్నే అనుసరించారన్నారు. స్త్రీ గా ఆమెకు ఎన్నో ఆటంకాలు, సమస్యలను సృష్టించినా ఆమె భయపడకుండా తపస్సు చేసి రచనలు చేశారన్నారు.
సాయంత్రం 6.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు మరియు ఎస్వీ సంగీత నృత్య కళాకారులచే సంగీత కచేరీ, తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే రాత్రి 7 గం.లకు హరికథ జరుగనుంది.
తరిగొండలో…
తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారికి పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం 6 గం.లకు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్టి గానం, రాత్రి 7 గం.లకు అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే హరికథ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో శ్వేత ఇంఛార్జి సంచాలకులు శ్రీ కె.రాజగోపాల రావు, తిరుపతి కేంద్రీయ విద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీ మునిగోటి వేణుగోపాల్, డా. సంగీతం కేశవులు, ఏఈవో శ్రీమతి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

No comments :
Write comments