30.5.25

సనాతన ధర్మాన్ని విస్తృతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి – టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు









ప్రత్యేక యూ ట్యూబ్ చానెల్ లో ఒకే చోట అన్నమయ్య సంకీర్తనలు  


సనాతన ధర్మాన్ని విస్తృతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళికలు తయారు చేయాలని  టిటిడి ఈవో  జే శ్యామల రావు ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ లోని సమావేశ మందిరంలో హెచ్ డి పిపి, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్,  అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, పబ్లికేషన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎపిక్ స్టడీస్, తదితర ప్రాజెక్ట్ అధికారులతో గురువారం టిటిడి ఈవో  సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని, భగవద్గీత సారాంశాన్ని పిల్లలు, యువతకు అర్థవంతంగా, సరళంగా ఉండేలా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భగవద్గీతలోని ముఖ్యమైన ఘట్టాలను సరళతరంగా, సులంభగా ఉండేలా కార్టూన్, వీడియోల రూపంలో అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. హిందూ ధర్మం విశిష్టత, ధార్మిక, ఆధ్యాత్మిక,మానవీయత, నైతిక విలువల గురించి యువతకు తెలియజెప్పేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేలా ధార్మిక కార్యక్రమాలను తయారు చేయాలని సూచించారు. విద్యార్థులలో దైవభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ, ఉమ్మడి కుటుంబవ్యవస్థ తదితర అంశాలపై యువతకు శిక్షణ ఇచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలన్నారు.

భజన మందిరాలు ఇప్పటి వరకు ఎన్ని పూర్తి అయ్యాయి, చివరి దశలో ఎన్ని ఉన్నాయో సమగ్ర నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హిందూ ధార్మిక ప్రచార పరిషత్ ద్వారా ఇప్పటి వరకు అమలు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని మరింత నాణ్యంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ధార్మిక కార్యక్రమాల నిర్వాహకులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేలా ఇప్పటి నుంచే సంబంధిత ప్రతినిధులతో మాట్లాడాలని కోరారు. పచ్చదనాన్ని మరింత పెంచేలా శ్రీవారి దర్శనార్థం వచ్చి తిరిగి వెళ్లే  భక్తుల ద్వారా గ్రీనరీని ప్రోత్సహించే  విధంగా  ‘శ్రీవారి వన నిధి’ ద్వారా ఒక మొక్కను  ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.

ప్రత్యేక యూ ట్యూబ్ చానెల్ లో ఒకే చోట అన్నమయ్య సంకీర్తనలు  

శ్రీవేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ పనితీరును టిటిడి ఈవో సమీక్షించారు. టిటిడి వెబ్ సైట్ లోని ప్రత్యేక యూ ట్యూబ్ చానెల్ లో  తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలను అన్నింటినీ  ఒకే చోట ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అన్నమయ్య సంకీర్తనలలో ఇప్పటికే బాగా పాపులర్ అయిన వాటిని ముందుగా పొందు పరిచి, దశల వారీగా అన్ని సంకీర్తనలను అందులో పొందుపరచాలని సూచించారు. కొత్త సంకీర్తలు బాగా పాపులర్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అన్నమయ్య 32 వేల సంకీర్తనలలో 14, 932 సంకీర్తలు లభ్యమయ్యాయి. అందులో ఇప్పటి వరకు ఎన్ని సంకీర్తనలను రికార్డు చేశారు, ఇంకా ఎన్ని రికార్డు చేయాల్సి ఉంది, అన్నమయ్య కీర్తనల ప్రత్యేక వెబ్ పేజీలో ఎన్ని సంకీర్తనలు అప్ లోడ్ చేశారు, ఇంకా ఎన్ని చేయాల్సి వుందో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు.

అనంతరం టిటిడి పబ్లికేషన్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. టిటిడి ముద్రించిన అన్ని పుస్తకాలు టిటిడి బుక్ స్టాల్స్ లో లభ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు, యువతకు అర్థవంతంగా, సులభతరంగా ఉండేలా కథనాలు రాసి ముద్రించాలన్నారు. ఇప్పటి వరకు టిటిడి ఎన్ని పుస్తకాలను ముద్రించింది, టిటిడి ఈ బుక్స్ లో ఎన్నింటిని అప్ లోడ్ చేశారో వివరాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విశేష ఆదరణ పొందిన పుస్తకాలను ముద్రించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.  

ఈ సమావేశంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, డిపిపి సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ప్రత్యేక అధికారి శ్రీ రాజగోపాల్, అడిషనల్ సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ మేడసాని మోహన్, డైరెక్టర్ శ్రీమతి లత, దాస సాహిత్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ బీఆర్ రామానందతీర్థాచార్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.  

No comments :
Write comments