28.5.25

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్స‌వాలు వైభవంగా నిర్వహించాలి : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ వి.వీరబ్రహ్మం







తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్స‌వాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుపతి జేఈవో  అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్స‌వాల ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ త్వరితగతిన  బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వాహనసేవల సమయంలో గాంధీ రోడ్డు, కర్నాల వీధుల్లో  అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రధాన రహదారుల్లో ఆర్చీలు, స్వామివారి వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్ లు ఏర్పాటుచేయాలన్నారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తగినంత మంది శ్రీవారి సేవకులతో క్యూలైన్ల క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు.
 
భక్తులకు స్వామివారి అన్నప్రసాదం, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. రథోత్సవం రోజున భక్తులకు పానకం అందించాలన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన క‌ళాకారులతో భజనలు, కోలాటాలు, కేరళ డ్రమ్స్, జానపద నృత్యం ఇతర సాంస్కృతిక‌ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఎండకు, వర్షానికి భక్తులకు ఇబ్బందులు లేకుండా పందిళ్లు వేయాలని, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవలను ప్రసారం చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగ్గా ఉంచాలని సూచించారు. ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. భద్రతాపరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేయాలని భద్రతాధికారులను కోరారు. 
 
ఈ సమీక్షలో టిటిడి ఎఫ్ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, ఎస్ ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, శ్రీ లోకనాధం, శ్రీ ఆర్ సెల్వం, సిఎంవో శ్రీమతి నర్మద, ఆల్ ప్రాజెక్టు లు పివో శ్రీ రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్టు శ్రీమతి లత, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి,  ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
 

No comments :
Write comments