వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. రద్దీ కారణంగా దర్శన సమయం ఆలస్యమవుతున్నప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో అధిక సంఖ్యలో భక్తులకు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శన క్యూలైన్లలో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్న, పానీయాలను నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు.
అన్నీ విభాగాల అధికారుల సమన్వయంతో పని చేస్తూ భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేందుకు కృషి చేస్తున్నారు. విజిలెన్స్, ఆలయ విభాగాలు సమర్థవంతంగా క్యూలైన్లను నిర్వహిస్తుండటంతో సాధారణ రోజుల్లో కంటే 10వేల మంది వరకు భక్తులకు అదనంగా దర్శన భాగ్యం కలుగుతోంది.
ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల్లో (గురు, శుక్ర, శని, ఆదివారాల్లో) శ్రీవాణి దర్శనాలు కొనసాగుతున్నపటికీ కూడా 3,28,702 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్న ప్రసాదం విభాగం ద్వారా 10,98,170 మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందించగా, 4,55,160 మంది భక్తులకు పానీయాలు (టీ/కాఫీ/పాలు/మజ్జిగ) అందించారు.
ఈ నాలుగు రోజుల్లో 1,52,587 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, టీటీడీ వైద్య విభాగం ద్వారా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 12,172 మంది భక్తులు వైద్య సేవలు పొందారు.
క్యూలైన్లలో ఆరోగ్యశాఖ నిరంతరాయంగా తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతను నిర్వహిస్తోంది. మొత్తం 2,150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, మైస్త్రీలు, ఇన్‌స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం మూడు షిప్టుల్లో 24 గంటలు సేవలు అందిస్తున్నారు.
టీటీడీలోని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.










No comments :
Write comments