తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి.
చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6 గం. నుండి 6.30 గం.ల వరకు వేద పారాయణం, 6.30 నుండి 7.30 వరకు ఊంజల్ సేవ, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ తరువాత మహా పూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్ చలపతి, సుబ్బరాయుడు , విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.









No comments :
Write comments