1.6.25

జూన్ 06 నుండి 15వ తేదీ వ‌రకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు Appalayagunta Temple




అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 06 నుండి 15వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 03వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్ 06వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

 
07-06-2025   ధ్వజారోహణం -                      పెద్దశేష వాహనం
 
08-06-2025   చిన్నశేష వాహనం,               హంస వాహనం
 
09-06-2025    సింహ వాహనం,                     ముత్యపుపందిరి వాహనం
 
10-06-2025   కల్పవృక్ష వాహనం,              శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం,               సర్వభూపాల వాహనం
 
11-06-2025   మోహినీ అవతారం,                గరుడ వాహనం
 
12-06-2025  హనుమంత వాహనం,             గజ వాహనం
 
13-06-2025    సూర్యప్రభ వాహనం,             చంద్రప్రభ వాహనం
 
14-06-2025    రథోత్సవం,                                అశ్వవాహనం
 
07-06-2025    చక్రస్నానం ,                              ధ్వజావరోహణం

ఆలయ విశిష్టత : సుమారు వేయి ఏళ్లుకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్న కార్వేటినగర ప్రభువుల పాలనలో శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి అప్పలాయగుంట ఆలయం ఉండినట్లు, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయ ఉత్సవాలు, ఊరేగింపుల తరహాలో అప్పలాయగుంట ఆలయమునందు కూడా కార్వేటినగర ప్రభువులు ప్రధానపాత్ర పోషించి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. 

స్థల పురాణం: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలలోని వకుళామాత ఆశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో శ్రీ సిద్దేశ్వర స్వామి వారి తపస్సును మెచ్చి, ఆయన కోరిక మేరకు ప్రసన్నుడై అక్కడ అభయ హస్తముతో వెలసినట్లు తెలియుచున్నది. 

ఈ ఆలయం తూర్పు ముఖముగా నిర్మింపబడి, గర్భాలయం నందు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి మూలమూర్తి చతుర్బుజుడై శంఖుచక్రాలు ధరించి, కటిహస్తం మరియు అభయహస్త ముద్రతో ప్రసన్నుడై ఉంటూ శ్రీదేవి, భూదేవి, చక్రత్తాళ్వారు, విష్వక్సేనులు, బాష్యకారుల ఉత్సవ విగ్రహాలు కలిగియున్నారు. గర్భాలయానికి నైరుతిమూలలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయము, వాయువ్యమూలలో శ్రీగోదాలక్ష్మీ అమ్మవారి ఆలయం స్వామివారికి అభిముఖముగా గరుత్మంతుల వారి విగ్రహము వెలసియున్నది. ఆలయ వెలుపలి ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఉన్నది.
 
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 10వ తేదీ సాయంత్రం 4.30 - 6.30 గంటల మధ్య స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.
 
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

No comments :
Write comments