తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం గరుడసేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా సుమారు రూ.34.46 లక్షల విలువైన మూడు ఆభరణాలు టిటిడి సమర్పించింది.
తన అన్నగారైన శ్రీ గోవిందరాజునికి తిరుమల శ్రీవారు దాదాపు రూ.34.46 లక్షలు విలువ చేసే 03 ఆభరణాలు…వాటిలో స్వామివర్ల దీర్ఘచతురస్రాకార పతకం ఒకటి, అమ్మవర్ల దీర్ఘచతురస్రాకార రెండు పతకములను శాశ్వత ప్రాతిపదికన టిటిడి బహుకరించింది.
స్థానిక శ్రీ ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారి ఆభరణాలను ఊరేగింపుగా తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ ఎం.లోకనాథం శ్రీగోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు.
అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరింప బడ్డ శ్రీ గోవిందరాజ స్వామి సకల వైభవంతో శక్తివంతమైన గరుడవాహనంపై, నాలుగు మాడ వీధుల వెంట విహారిస్తూ, ఆనందోత్సాహాల మధ్య తన భక్తులను ఆశీర్వదిస్తారు.
అంతకుముందు గరుడ సేవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4 - 5 గం.ల మధ్య స్వామి వారికి నూతన వస్త్రాలు, తిరువడి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఊరేగింపు తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుండి బజార్ వీధి, సన్నిధి వీధి నుండి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకున్నాయి.
ఏనుగులు, గుర్రాలు, రంగురంగుల నృత్య బృందాలు, కోలాటం కళాకారుల ప్రదర్శనలు వాహన ఊరేగింపు శోభను మరింత ఇనుమడింప చేసాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, తిరుమల ఆలయ బొక్కసం సూపరింటెండెంట్ శ్రీ వి.ఆర్.గురురాజ స్వామి, ఏవీఎవ్వోలు శ్రీ రాజశేఖర్, శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments