20.6.25

క్రమం తప్పకుండా శాఖల వారీగా భక్తుల నుండి అభిప్రాయ సేకరణ - టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు






శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానములు అందిస్తున్న సేవలపై క్రమం తప్పకుండా అభిప్రాయ సేకరణ ప్రామాణికంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు తెలిపారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణపై వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వడ పంపిణీ, వసతి, కాలినడక భక్తులకు అందితున్న సేవలు, లగేజీ, కళ్యాణకట్ట, వైద్యం, పారిశుధ్యం, పరిశుభ్రత, విజిలెన్స్, ట్రాన్స్ ఫోర్ట్ తదితర అంశాలపై భక్తుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. శ్రీ మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాధ్యాసాద్యాలను పరిశీలించాలని అధికారులను సూచించారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఆలస్యం చేయకుండా క్రమపద్దతిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యం, వంట సరుకుల నాణ్యత పరీక్షించేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగించి భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలను అందించాలని కోరారు.

వసతి గృహాలలో సకాలంలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించేందుకు వీలుగా రిసెపక్షన్, ఐటీ విభాగాలు సమన్వయంతో ఎఫ్.ఎమ్. ఎస్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భక్తుల రద్దీ సమయాలలో లడ్డూ కౌంటర్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా, ఆలస్యం చేయకుండా లడ్డూలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీకి తగ్గట్టుగా లడ్డూ కౌంటర్లలో సిబ్బందిని నియమించాలన్నారు. తిరుపతి, తిరుమల ప్రాంతాలలో రవాణా వ్యవస్థ మీద విజిలెన్స్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నిఘాను మరింత పెంచాలని , కల్యాణకట్టలో విజిలెన్స్ విభాగం, కల్యాణకట్ట విభాగాలు మరింత సమన్వయంతో భక్తులకు సేవలు అందించాలని సూచించాలన్నారు. తిరుమలలో ఉచిత బస్సుల సేవలపై భక్తులకు తెలిసేలా ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, శ్రీవారి సేవకులను నియమించి అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి పరిపాలనా భవనం నుండి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళీ కృష్ణ, సీఈ శ్రీ టివి సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

No comments :
Write comments