11.6.25

ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప



 





తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు.

అంతకుముందు ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు.
సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments