తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. రాత్రి 7.00 గంటల నుండి 10.00 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం కరతలామలకమని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. జ్ఞాన, వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన, వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠుతుడైన గరుడుని దర్శించి అభీష్ఠసిద్ధి పొందుతారు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవోలు శ్రీ ఎం.లోకనాథం, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, పలువురు అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.






No comments :
Write comments