2.6.25

తిరుమలలో ఘనంగా శ్రీ భోగశ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం Sahasra Kalasabhishekam





శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ ఆదివారం నాడు వైభవంగా ఏకాంతంగా నిర్వహించింది.

ఇందులో బాగంగా ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు.
శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్ ను, అయ‌న‌కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఆశీసునులు చేశారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేశారు. అన‌గా శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి నిర్వ‌హించే అభిషేకాధి క్ర‌తువులు మూల‌మూర్తికి నిర్వ‌హించిన‌ట్లు అవుతుంది.
అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు ఏకాంతంగా ప్ర‌త్యేక సహస్రకలశాభిషేకం వైభ‌వంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా జ‌రుగుతాయి.
చారిత్రక నేపథ్యం :
పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.
ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన‌జీయ‌ర్ స్వామి, టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు, టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, ఆల‌య‌ ప్ర‌ధాన అర్చ‌కుల్లో ఒక‌రైన‌ శ్రీ వేణుగోపాల దీక్షితులు, డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, పేష్కార్ శ్రీ రామ‌కృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments