8.6.25

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను తీర్చిదిద్దాలి - టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు State of Art Technology




తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఆదేశించారు. టిటిడి ఈవో ఛాంబర్ లో శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అత్యాధునిక తనిఖీ కేంద్రంగా అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను మార్చడం వల్ల భక్తులు ఎక్కువ సమయం వేచియుండకుండా వచ్చిన వారికి వచ్చినట్లు స్కానింగ్ చేయవచ్చు, మరింత వేగంగా లగేజీని భక్తులకు అందించవచ్చునని అన్నారు. భక్తుల వాహనాలు, లగేజీని తక్కువ సమయంలో స్కాన్ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు, నాలుగు మరియు ఆరు చక్రాల వాహనాలను మరింత వేగంగా స్కానింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. టోల్ ప్లాజాను శాస్త్రీయంగా స్కానింగ్ చేసేందుకు వీలుగా మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, క్యూ మేనేజ్మెంట్, భద్రత, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, అత్యాధునిక సిసి కెమెరాల ఏర్పాటు, మౌళిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లలో స్కానింగ్ చేసి లగేజీని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలించాలన్నారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టిటిడి ఐటీ విభాగం, విజిలెన్స్ శాఖ కసరత్తు చేయాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా, సమయానికి, వేగంగా, భద్రంగా లగేజీని అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఅండ్ ఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్థన్ రాజు, సిఈ శ్రీ టివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments