జూలై 16న ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం, శ్రీ ఆండాల్ (గోదాదేవి) సన్నిధి, శ్రీ పెరియాళ్వార్ సన్నిధి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలలో మూల విరాట్టులకు వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, కర్పూరం, గంధం పొడి, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అటు తర్వాత స్వామి, అమ్మవార్లకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేధ్య కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు.
అంతకుముందు ఆలయం మొదలుకుని గర్భాలయం వరకు, ఉప ఆలయాలు, ఆలయాల ప్రాంగణాలు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ చేపట్టడం ఆనవాయితీ వస్తోంది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి. వి.ఆర్. శాంతి. ఏఈవో శ్రీ ఏ. భాస్కర్ నారాయణ్ చౌదరి, సిబ్బది, అర్చకులు పాల్గొన్నారు.
No comments :
Write comments