15.7.25

శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆల‌యంలో వైభ‌వంగా పుష్పయాగం Nandaluru




అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జ‌రిగింది.


ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, మొగలిరేకులు వంటి 12 రకాల పూలు, తులసి, మ‌రువం. ధ‌వ‌నం వంటి 4 రకాల ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

జూలై 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్‌, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments