29.7.25

శ్రీనివాస కల్యాణోత్సవాల నిర్వహణకు విధి, విధానాలు రూపొందించండి - టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు Srinivasa Kalyanotsavm






శ్రీనివాస కల్యాణోత్సవాలను టిటిడి మరింత పటిష్టాత్మకంగా  నిర్వహించేందుకు విధి, విధానాలు రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంలతో కలిసి అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవాన్ని మరింత విశ్వ వ్యాప్తం చేసేందుకు శ్రీనివాస కల్యాణోత్సవాలను చేపడుతున్నారని, టిటిడి ప్రతిష్ట మరింత పెంచేలా కల్యాణోత్సవాల నిర్వహణకు నివేదిక రూపొందించాలని కల్యాణోత్సవం ప్రాజెక్ట్ అధికారులను ఈవో ఆదేశించారు. శ్రీనివాస కల్యాణోత్సవాలను వ్యాపార దృక్పధంతో కాకుండా భక్తి భావంతో నిర్వహించే సంస్థలు, నిర్వహణ వ్యక్తుల ఎంపిక , ఏ ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు, ఆర్థిక, న్యాయపరమైన తదితర అంశాలపై ముందుగా ఎంవోయూ చేసుకునేలా పటిష్ట నియమాళిని రూపొందించాలన్నారు.

 ఇప్పటికే ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలను విదేశాల్లో నిర్వహిస్తున్న క్రమంలో  ప్రణాళికా బద్ధంగా శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  విదేశాల్లో కల్యాణోత్సవాల నిర్వహణలో చేయవలసిన పనులు, చేయరాని పనుల జాబితాను రూపొందించి, అందుకు అనుగుణంగా పటిష్టంగా నిర్వహణకు  నిబంధనలు తయారు చేయాలన్నారు.

అనంతరం తిరుమలలో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఈవో, వ్యర్థాల నిర్వహణలో టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ టివి సత్యనారాయణ, డిపిపి సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సోమన్నారయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments