2.8.25

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికై అస్సాం ముఖ్యమంత్రిని కలిసిన టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు gouhati temple




ఐదెకరాల స్థలం కేటాయించడంతో పాటు ఆలయ నిర్మాణానికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ


గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికై అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మను టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.

ఈ మేరకు స్పందించిన ముఖ్యమంత్రి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇస్తూ, తమ రాష్ట్ర రాజధానిలో స్వామి వారి అద్భుతమైన ఆలయం నిర్మించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాము గౌహతిలో స్వామి వారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించవలసిందిగా కోరుతున్నట్టు చైర్మన్ వెల్లడించారు.

ఈ సందర్భంగా గౌహతిలో స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ పాలకమండలికి అస్సాం సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత కామాఖ్య అమ్మవారి ఆలయ విశిష్టతను సీఎం వివరించారు.

టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించబడే ఈ అద్భుతమైన ఆలయం ద్వారా హిందూ మత ధర్మ పరిరక్షణ, హిందూ సాంప్రదాయం మరియు హిందూ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వామి వారి ఆలయ నిర్మాణం ద్వారా ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని త్వరగా తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి ( న్యూడిల్లీ ) ప్రముఖ పాత్ర వహించారు.

No comments :
Write comments