11.9.25

సంగీత, సాహిత్య, నాట్యకళల మేళవింపే హరికథ - హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి శ్రీ రా మ్ ర‌ఘునాథ్‌ harikadha vaibhavam






సంగీతం, సాహిత్యం, నాట్యకళల మేళవింపే హరికథ కళారూపమని, కాబట్టే సామాన్య జనుల నుండి ఇప్పటికీ అమితమైన ఆదరణ లభిస్తోందని టీటీడీ హిందూ ధ‌ర్మ ప్ర‌చార‌ప‌రిష‌త్‌ కార్య‌ద‌ర్శి శ్రీ రామ్ ర‌ఘునాథ్‌ పేర్కొన్నారు. తిరుప‌తి శ్వేతా భ‌వ‌నంలో గ‌త 10 రోజులుగా నిర్వ‌హిస్తున్న " హ‌రిక‌థ వైభ‌వం " శిక్ష‌ణ త‌ర‌గ‌తులు బుధ‌వారం ముగింపు స‌మావేశం ఘ‌నంగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా డిపిపి కార్య‌ద‌ర్శి మాట్లాడుతూ, స‌నాత‌న హైంద‌వ ధ‌ర్మాన్ని సామాన్య ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌ చేయ‌డానికి, సామాజిక స్పృహ కలిగి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి హ‌రిక‌థ ఒక ఆయుధ‌మ‌న్నారు. పురాతన కాలంలో కళాకారులను పోషించిన రాజులు చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. సైద్ధాంతిక వైభవం గల టీటీడీ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. హ‌రిక‌థ శ్రీ‌వారి వైభ‌వంలో అతి ముఖ్య పాత్ర పోషిస్తుంద‌న్నారు. ఇక్క‌డ శిక్ష‌ణ పొందిన హ‌రిదాసులు అనేక మెర‌గులు తీర్చిదిద్ది జ‌న బాహుళ్యంలోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంత‌రం అద‌న‌పు కార్య‌ద‌ర్శి శ్రీ రామ్ గోపాల్ మాట్లాడుతూ, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాస గొప్ప కళారూపమైన హరికథకు ఆద్యుడిగా నిలిచారని, హిందూ మ‌తానికి ఎన‌లేని సేవ‌లు అందించార‌ని తెలిపారు. ఆధ్యాత్మిక చింత‌న‌లో నాటి నుండి నేటి వ‌ర‌కు హ‌రిక‌థ ప్ర‌ధాన ఆధ్యాత్మిక ప్ర‌చారానికి మూల‌మై అన్ని త‌ర‌గ‌తుల ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తుంద‌న్నారు. హరికథ గొప్పదనం గురించి వివరించారు.  
త‌రువాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి శిక్ష‌ణ త‌ర‌గ‌తులకు విచ్చేసిన 30 మంది మ‌హిళా హ‌రిదాసుల‌కు హ‌రిక‌థ ప‌త్రం అందించారు.    
ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి విజ‌య‌ల‌క్ష్మీ, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

No comments :
Write comments