8.9.25

వైభవంగా శ్రీ కోదండ‌రామయ్య క‌ల్యాణం sri kodanda rama temple





ఒంటిమిట్టలో పౌర్ణ‌మి సంద‌ర్భంగా శ్రీ కోదండరాముడి శ్రీ సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా జ‌రిగింది. విశేష సంఖ్య‌లో భక్తులు స్వామివారి  క‌ల్యాణోత్స‌వాన్ని తిల‌కించారు.

ఇందులో భాగంగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది.
అంత‌కుముందు ఉద‌యం శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంల‌తో స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.
ఈ కార్యక్ర‌మంలో టీటీడీ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎ. నవీన్ కుమార్, అర్చ‌కులు, విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

No comments :
Write comments