19.9.25

అన్న ప్రసాద కేంద్రంలో టీటీడీ ఈవో తనిఖీలు ttd eo inspection











టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింగాల్ అన్నారు.

గురువారం సాయంత్రం ఆయన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూ లైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద అన్న ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై సమాచారం సేకరించారు.
వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్స్‌లను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్న ప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నదానం కార్యక్రమం 1985లో ప్రారంభమై, 1994లో అన్నప్రసాదం ట్రస్టుగా ఏర్పడిందని చెప్పారు. 2020 వరకు ఈ కార్యక్రమం నడవడానికి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చిందని, ఆ తర్వాత స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు.
ప్రతి ఏటా విరాళాలు పెరుగుతున్నాయని, కార్పస్ నిధులు, వాటి వడ్డీలు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
2023–24లో కార్పస్ రూ.1854 కోట్లు, 2024–25లో రూ.2127 కోట్లు, 2025 ఆగస్టు వరకు రూ.2263 కోట్లకు చేరిందని వివరించారు.
వడ్డీలు రూపంలో 2024లో రూ.221 కోట్లు, 2025లో రూ.270 కోట్లకు పెరిగిందని, ప్రస్తుతం వార్షిక వ్యయం రూ.150 కోట్లు ఉందని తెలిపారు. రూ.కోటి విరాళదారులు కూడా పెరిగారని, 2023–24లో 14 మంది ఉంటే, 2024–25లో 25 మంది, ఈ సంవత్సరం ఐదు నెలల్లోనే 14 మంది రూ.కోటి పైగా విరాళం అందజేశారని చెప్పారు.
గత నాలుగు దశాబ్దాలుగా టీటీడీ భక్తులకు అందిస్తున్న విశ్వసనీయ సేవలతో భక్తులు విశేషంగా విరాళాలు అందజేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం తాము వార్షిక బ్రహ్మోత్సవాలపై దృష్టి సారించామని, భక్తుల అభిప్రాయాలు, ఈ-మెయిల్, డయల్ యువర్ ఈవో, వాట్సాప్, సర్వే, IVRS ద్వారా వచ్చే సూచనలు వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు, సిబ్బందంతా సహకరిస్తున్నారని ఈవో తెలిపారు.
ఈ తనిఖీల్లో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments