5.10.25

అక్టోబర్ 05 నుండి 07వ తేదీ వరకు శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు valmikipuram




అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 05 నుండి 07వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అక్టోబర్ 04వ తేదీన అంకురార్పణ చేపట్టారు.

05వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం,  06వ తేదిన పవిత్ర సమర్పణ, 07వ తేదిన మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం తిరుచ్చి వీధి ఉత్సవం చేపడుతారు.
ఈ ఉత్సవాల సందర్భంగా పవిత్రోత్సవాల్లో పాల్గొన దలచిన భక్తులు ఒక టిక్కెట్టుకుగాను రూ.300/-లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక టిక్కెట్టుకు ఇద్దరిని అనుమతిస్తారు.
సంక్షిప్త సమాచారంః-
పరమాత్ముని శాస్త్రోక్తముగా అర్చించుట బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాని పని. ఆజ్ఞానులమైన, అశక్తులమైన, అల్పజ్ఞులమైన మనచే చేయబడు అర్చన మంత్రహీనం,  ద్రవ్యహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, క్రియాహీనం అవుతుంది.
ఆగమోక్తంగా జరుపు నిత్య – వార – మాస – పక్ష – నక్షత్ర – సంవత్సరములందు జరుగు అర్చన, స్నపన, ఉత్సవ, విశేష పూజాదులలో తెలిసీ తెలియని దోషాలు సంభవిస్తే అది సంపూర్ణ ఫలితము నివ్వదు.
శ్రీపట్టాభిరామ స్వామి వారికి చేయు అర్చనాదోషములతో పాటు, అన్ని దోషములు నివారింపచేయునది, సర్వాభీష్టములను, అందించునది, యజ్ఞఫలమును ప్రసాదించునది, మన ఆత్మశరీరం ఇంద్రియములు వాక్కు, కర్మలను పవిత్రములుగా చేయునది పవిత్రోత్సవము.
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ పట్టాభిరామ స్వామివారికి ఈ పవిత్రోత్సవసేవ అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది.  ఈ ఉత్సవంలో అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు,  పవిత్ర ప్రతిష్ట, విశేష హోమం, పవిత్ర సమర్పణ, వీధి ఉత్సవం, పూర్ణాహుతి అను వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

No comments :
Write comments