21.11.25

కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణ అలంకారంలో సిరులతల్లి kalpavruksha vahanam











తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో  శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. 

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ, చిరుజల్లుల మధ్య  వాహనసేవ కోలాహలంగా జరిగింది. 
క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి 
పాలకడలిని అమృతం కోసం మథించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వ జన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి.మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, అర్చకులు శ్రీ బాబుస్వామి, అర్చకులు , ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

No comments :
Write comments