తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ భాస్కర నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు, అర్చక బృందం పాల్గొన్నారు.


No comments :
Write comments