తిరుపతి
శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
తెప్పలను అధిరోహించిన స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments