దేశంలోని
వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టిటిడి కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి కల్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, ఆదరణ లేనివి ఎన్ని, ఆధునీకరించబడినవి ఎన్ని, తదితర స్థితిగతులు, భక్తులు సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టిటిడి పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈవోను ఆదేశించారు. టిటిడి ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి డాక్యుమెంటను రూపొందించాలన్నారు. అలాగే, టిటిడిలోని అన్ని విభాగాలలోని మౌలిక వసతులకు సంబంధించి టూల్స్ అండ్ ప్లానింగ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్‌ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో ఆదేశించారు. భక్తులు ఆ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి, తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి వసతి గృహాలలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సేవలను మరింత మెరుగుపరచి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
టిటిడి భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై స్థిరమైన మరియు ఖచ్చితమైన రికార్డులు రూపొందించేందుకు నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు. టిటిడి అనుబంధ ఆలయాలలో భక్తులకు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలలో పాల్గొనే భక్తులకు బహుమానాల జారీ కొరకు టికెట్ స్కానింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో గుత్తేదారులకు సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, టిటిడి వేద పాఠశాలల్లో బోధనా సిబ్బందిని భర్తీ చేయాలని, అటవీ విభాగంలో ఇంకనూ పూర్తి కాని పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, టిటిడి ఆలయాలు, వసతి గృహాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈవో సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఎఫ్.ఏ.అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments