రాయలసీమ
ప్రాంత ప్రజలకు వరప్రదాయినిగా వున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో క్యాన్సర్ విభాగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి క్యాన్సర్ వ్యాధి ఏ దశలో వున్నా ఉన్నత ప్రమాణాలతో అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నారని టి.టి.డి. ఇన్‌చార్జ్ ఈ.ఓ. శ్రీ వెంకయ్య చౌదరి కొనియాడారు. ‘ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని’ పురస్కరించుకుని బుధవారం స్విమ్స్‌లో క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ, పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ, పోస్టర్ల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టి.టి.డి. ఇన్‌చార్జ్ ఈ.ఓ శ్రీ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ... స్విమ్స్‌లో రూ. 120 కోట్ల వ్యయంతో 300 పడకలు, 5 ఐసియూలు ఇతర అత్యాధునిక వైద్య పరికరాలతో అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
క్యాన్సర్ ప్రారంభ దశ నుండి చివరి దశ వరకు వున్న రోగులకు సమర్ధవంతమైన వైద్యసేవలు అందించేందుకు నిపుణులైన వైద్య బృందం స్విమ్స్‌లో వున్నారని చెప్పారు. రెండు పింక్ బస్సుల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నారని, వీటి ద్వారా ముందస్తుగా వ్యాధిని గుర్తించేందుకు వీలు కలుగుతోందని వివరించారు. పింక్ బస్సుల ద్వారా ఇప్పటి వరకు 730 క్యాంపులు నిర్వహించి 42,609 మందికి స్క్రీనింగ్ చేశారని, 3226 మందిని స్విమ్స్‌కు రెఫర్ చేసారని వీరిలో 759 మందికి పూర్తి చికిత్స అందించారని తెలియజేశారు. పేషంట్లకు విశేష సేవలు అందిస్తున్న స్విమ్స్ డైరెక్టర్ డా॥ ఆర్.వి.కుమార్ ను, వైద్య బృందాన్ని అభినందించారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకమని ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. స్విమ్స్ 20 ఏళ్ళుగా క్యాన్సర్ వైద్య సేవలను అందిస్తోందని, టి.టి.డి సహకారంతో ఈ విభాగాలను ఆధునీకరించి, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ మరియు మెడికల్ ఆంకాలజీ విభాగాలలో పూర్తి స్థాయిలో శస్త్ర చికిత్సలు, వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. వీటితో పాటు క్యాన్సర్ వ్యాధి చికిత్స దశ దాటిపోయిన వారికి ఉపశమన వైద్య సేవలు అందించేందుకు పాలియేటివ్ కేర్ విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు ఎన్.టి.ఆర్ వైద్య సేవ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని అదనంగా అయ్యే వైద్య ఖర్చులను ప్రాణదానం పథకం క్రింద అందజేస్తున్నామని తెలియజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డా॥ సుబ్రమణియన్, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డా॥ భార్గవి, పాలియేటివ్ కేర్ వింగ్ ప్రొఫెసర్ డా॥ ప్రాణబంధు దాస్ తో పాటు వైద్యులు డా॥ దీప్తి, డా॥ ఆదిత్య తదితరులు పలు రకాల క్యాన్సర్ వ్యాధులపై అవగాహన కల్పించారు.
'భయం కాదు భాద్యత ముఖ్యం' అనే అంశంతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేలా స్విమ్స్ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ ఆకట్టుకుంది. అనంతరం క్యాన్సర్ వ్యాధిపై విజయం సాధించిన పలువురు టి.టి.డి. స్విమ్స్ అందించిన వైద్య సేవలను కొనియాడారు. అదే విధంగా తమ అనుభవాలను ఇతర పేషంట్స్‌తో పంచుకున్నారు. ఇందులో భాగంగా మెడికల్ ఆంకాలజీ విభాగం ద్వారా వైద్య సేవలు అందుకుంటున్న నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం బండ్లపాళ్యెం గ్రామానికి చెందిన అరుదైన క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న తుమ్మల సంధ్య (11) అనే చిన్నారికి మందుల కోసం నెలకు రూ. 2 లక్షలు అవుతోందని, రెండు నెలలకయ్యే ఖర్చును మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డా॥ భార్గవి వ్యక్తిగతంగా సహాయంగా అందించారని చిన్నారి తల్లి - టి.టి.డి. ఇన్‌చార్జ్ ఈ.ఓ శ్రీ వెంకయ్య చౌదరికి వివరించారు. ఇందుకోసం స్విమ్స్‌కు ఎంతో రుణపడి వున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన పోస్టర్ల ప్రదర్శనను సాయంత్రం వరకు విశేష సంఖ్యలో ప్రజలు సందర్శించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్, సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డా॥ నరేంద్ర, కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డా॥ కె.నాగరాజ్, ఫిజియోథెరపి కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె.మాధవి, త్రివేండ్రంకు చెందిన ఇంటర్నేషనల్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ వింగ్ అడ్వైజర్ డా॥ రాధ, ఆర్.ఎం.ఓ. డా॥ కోటి రెడ్డి, డిప్యూటి డైరెక్టర్ (ఎస్టాబ్లిష్మెంట్) డా॥ ఆదిక్రిష్ణయ్య, ఎ.డి. (పి.ఆర్) వి.రాజశేఖర్, ఎం.ఎస్.డబ్ల్యూ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిద్ద క్లినికల్ రీసెర్చ్ యూనిట్ ఆధ్వర్యంలో …
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్విమ్స్ నిర్వహించిన ర్యాలీలో సిద్ద క్లినికల్ రీసెర్చ్ యూనిట్ డాక్టర్లు పాల్గొన్నారు. అనంతరం క్యాన్సర్ పాలియేటివ్ కేర్‌కి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే కరపత్రాలు, ముడి ఔషదాలు , మిల్లెట్స్, యోగాసనాల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ ఆఫీసర్ డా॥కె.సామ్రాజ్, మెడికల్ కన్సల్టెంట్ డా॥ ఆర్.తమిళసెల్వన్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments