టిటిడిలో
త్వరలో ప్రారంభించనున్న శ్రీవారి వైద్య సేవకులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టినట్లు టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ వెల్లడించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని అవసరమైన భవనాల నవనీకరణలో భాగంగా అధికారులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడిలో శ్రీవారి వైద్య సేవకు అవసరమైన వైద్య రంగంలోని వివిధ విభాగాల నిపుణులకు అవసరమైన వసతి సౌకర్యం కల్పించేందుకు వీలుగా ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్, ఎస్వీ వేదిక్ యూనివర్శిటీలోని వసతి గదులను పరిశీలించామన్నారు. సంబంధిత వైద్యులు వైద్య సేవ చేసేందుకు వీలుగా వారం రోజుల పాటు బస చేసేందుకు వసతి గదుల నవనీకరణ, మౌళిక సౌకర్యాలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ ఆస్పత్రుల్లో ముఖ్యంగా అశ్వినీ ఆసుపత్రి, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించేందుకు వీలుగా చర్యలు చేపట్టామన్నారు. వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్య నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని జేఈవో తెలిపారు. ఇప్పటికే టిటిడిలోని వివిధ విభాగాలలో శ్రీవారి సేవకులు వారం రోజులకు గాను 4 వేల మంది శ్రీవారి సేవకులు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని, దాదాపు 17 లక్షలకు పైగా శ్రీవారి సేవకులు సేవలు అందించారన్నారు. శ్రీవారి సేవను వైద్య, విద్య, ఐటీ రంగాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఎంఓ డా. కుసుమ కుమారి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణు దీక్షిత్, బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వెంకట రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రామ్, ఎస్ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, శ్రీ నరసింహ మూర్తి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments