తిరుమలలోని
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 29వ శ్రీవేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
ఈ సదస్సు 13వ తేది వరకు ఆరు రోజుల పాటు పండితుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
శ్రీవారి దివ్యానుగ్రహంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న వేద, శాస్త్ర, ఆగమ, స్మార్త, ప్రబంధ పండితులను గుర్తించి, వారిని టీటీడీ పక్షాన పరీక్షించి, నగదు, శాలువా, విజయ పత్రికను అందించి గౌరవించేందుకుగాను 1969 సంవత్సరంలో శ్రీవేంకటేశ్వర వేద, శాస్త్ర, ఆగమ, విద్వత్ సదస్సును ప్రారంభించడం జరిగింది. 2020 వరకు 28 పర్యాయాలు జయప్రదంగా జరుపబడింది. నాటి నుండి నేటి వరకు వివిధ వైదిక విద్యలలో సుమారు నాలుగు వేల మంది పరీక్షలనిచ్చి ఈ సదస్సులో ఉత్తీర్ణులయ్యారు.
ఈసారి సదస్సుకు దేశవ్యాప్తంగా 800 మందికి పైగా అభ్యర్థులు సదస్సుకు హాజరవుతున్నారు. వారిని పరీక్షించుటకు 100 మందికి పైగా సుప్రసిద్ధ పండితులు పరిక్షాధికారులుగా అభ్యర్థులను పరీక్షించనున్నారు.
ఈ కార్యక్రమ ప్రారంభ సభలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానందతీర్థ స్వామీజీలు హాజరై అభ్యర్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
ఈ కార్యక్రమంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యలయం ఉప కులపతి ఆచార్య శ్రీ జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి శ్రీ రాణి సదాశివమూర్తి, ఇతర పండితులు పాల్గొన్నారు.
No comments :
Write comments