శ్రీ
తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను పరిష్కరించడంలో శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ విశేష కృషి చేశారని ఎస్‌పిడబ్ల్యూ మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల తెలుగు అధ్యాపకులు డా.శోభ తెలిపారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం ఉదయం శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 47వ వర్థంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా డా. శోభ “రాళ్లపల్లి వారు దర్శించిన సారస్వతా లోకము” అనే అంశంపై మాట్లాడుతూ, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు తెలుగు సాహిత్యంలోని విశాలమైన సారస్వత ప్రపంచాన్ని లోతుగా అధ్యయనం చేసి తమ రచనల ద్వారా పాఠకులకు పరిచయం చేసిన మహానుభావులని తెలిపారు. ఆయనకు ఉన్న విస్తృతమైన పాండిత్యం, సాహిత్యంపై ఉన్న అపారమైన అభిరుచి, పరిశీలనాత్మక దృష్టి కారణంగా సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను సమగ్రంగా అర్థం చేసుకుని వాటి సౌందర్యాన్ని స్పష్టంగా వివరిస్తూ సాహిత్యాభిమానులకు మార్గదర్శకత్వం చూపారని ఆమె పేర్కొన్నారు. రాళ్లపల్లి వారు తమ రచనల ద్వారా తెలుగు సారస్వతాన్ని సమృద్ధిగా చేసి సాహిత్య లోకానికి చిరస్థాయిగా నిలిచే సేవలు అందించారని ఆమె కొనియాడారు.
తరువాత నగరికి చెందిన తెలుగు పండితులు డా. మలేపట్టు పురుషోత్తమాచారి “రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారి జీవితం – రచనలు” అనే అంశంపై మాట్లాడుతూ, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు తెలుగు సాహిత్యం మరియు సంగీత రంగాలలో విశిష్టమైన సేవలు చేసిన మహనీయులని తెలిపారు. ఆయన జీవితమంతా సాహిత్యాభివృద్ధికి అంకితమై ఉండి అనేక విలువైన రచనలు చేసి తెలుగు భాషకు కీర్తి తీసుకొచ్చారని చెప్పారు. అలాగే ఆయన పండితత్వం, సంగీతంపై ఉన్న లోతైన జ్ఞానం మరియు సాహిత్యంపై ఉన్న అభిరుచి కలిసి ఆయనను గొప్ప రచయితగా, పండితునిగా నిలబెట్టాయని కొనియాడారు.
అనంతరం ఎస్‌వి విశ్వవిద్యాలయం విశ్రాంత అచార్యులు ఆచార్య దామోదర్ నాయుడు “విమర్శకుడిగా రాళ్లపల్లి” అనే అంశంపై ప్రసంగిస్తూ, రాళ్లపల్లి వారు తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం పొందిన మహనీయులని కొనియాడారు. రాళ్లపల్లి గారు కేవలం సంగీత విద్వాంసుడిగానే కాకుండా, సాహిత్యాన్ని లోతుగా అర్థం చేసుకుని విశ్లేషించే నిశితమైన విమర్శనా దృష్టి కలిగిన గొప్ప సాహిత్య విమర్శకుడిగా గుర్తింపు పొందారని చెప్పారు. వారి విమర్శలు లోతైన అధ్యయనం, నిష్పాక్షికత మరియు విశ్లేషణాత్మకతతో కూడి ఉండి తెలుగు సాహిత్య విమర్శకు విశేష సేవ చేశాయని వివరించారు.
పుష్పాంజలి :
కాగా, ఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త, అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్, సంచాలకులు శ్రీమతి లత, ఇతర అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు.
No comments :
Write comments