తిరుపతి
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి ఆనందపరిచారు.
గజరాజులు ముందుండగా, భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలతో భగవన్నామ స్మరణలో మునిగిపోయి స్వామివారిని కీర్తించాయి. మంగళవాయిద్యాల నాదస్వరంతో వాహనసేవ ఎంతో భక్తి భావంతో, కోలాహలంగా జరిగింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి కటాక్షాన్ని పొందారు.
పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు, “నా భక్తులను నేను ఎల్లప్పుడూ కాపాడుతాను” అనే సందేశాన్ని ప్రసాదించారు. భక్తులు శేషుని వలె నిత్య సేవకులై, భగవత్ కృపను పొంది సత్ఫలితాలు సాధించాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మార్చి 18న ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments