ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపంలోని రామతీర్థం, లక్ష్మణతీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు టిటిడి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఒంటిమిట్ట ఆలయం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం మరింత పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఈ మేరకు టిటిడి అటవీ శాఖ వాతావరణంకు అనుకూలంగా దీర్ఘకాలికంగా చెట్లు పెరిగేలా ప్రణాళికలు రూపొందించింది. టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం గురువారం రామతీర్థం గుట్టను పరిశీలించి అటవీ శాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.
రామతీర్థం, లక్ష్మణతీర్థం గుట్టలు కలిపి సుమారు 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఎక్కువగా పెద్ద రాళ్లతో ఉండటంతో, రాళ్ల మధ్య కూడా పెరిగే జాతికి చెందిన మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించారు.
ప్రయోగాత్మకంగా రావి, మర్రి, తెల్లమద్ది, జీలుగు వంటి చెట్లను నాటారు. దశలవారీగా దాదాపు 3 వేల చెట్లను నాటేందుకు టిటిడి ప్రణాళికలు సిద్ధం చేసింది. రాళ్ల మధ్యలో కూడా ఈ చెట్లు బాగా పెరిగేలా ప్రారంభ దశలో ప్రత్యేకంగా సంరక్షణ చేపడుతున్నారు.
ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటి ఒంటిమిట్ట పరిసర ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, టిటిడి అటవీ శాఖ అధికారి విజయకుమార్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments