ఒంటిమిట్టలోని
పవిత్రక్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఈ నెల మార్చి 26వ తేదీ నుండి వైభవంగా ప్రారంభంకానున్న నేపథ్యంలో, భక్తుల హృదయాలను పరవశింపజేసేలా విద్యుత్ అలంకరణలను టిటిడి అత్యంత వైభవంగా చేపట్టింది. వెన్నెలకన్నా వెలుగొందే దీప కాంతులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసరింపజేయనున్నాయి.
ఒంటిమిట్ట ఆలయం పరిసరాలు, టిటిడి భవనం, వాహన మండపం, ప్రధాన కూడళ్లు, అలాగే ఒంటిమిట్ట నుండి మాధవవరం వరకు ఏర్పాటు చేస్తున్న అద్భుత విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్ధులను చేయనున్నాయి. పండుగ వాతావరణాన్ని మరింత మధురంగా మార్చుతూ బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు చేర్చేలా ఈ ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఆలయం లోపల మరియు వెలుపల ప్రాంతాలు, నాలుగు మాడ వీధులు, పుష్కరిణి, కార్ పార్కింగ్ ప్రాంతం, ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలు, కల్యాణ వేదిక తదితర ప్రాంతాలు రాత్రివేళల్లో రజత కాంతులతో మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు అపూర్వమైన శోభను చేకూర్చనున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్న, మధ్య, పెద్ద పరిమాణాల్లో సుమారు 60కు పైగా అద్భుత ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామ కల్యాణం, అయోధ్య రాముడు, ఏనుగు మీద శ్రీవారు, గరుత్మంతుడిపై శ్రీవారు, శ్రీ పద్మనాభ స్వామి, అమ్మవారి త్రీడీ రూపం, దశావతారాలు, అష్టలక్ష్ములు వంటి దివ్యరూపాలు విద్యుత్ కాంతుల్లో ప్రతిఫలిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక శోభను పంచనున్నాయి.
అదేవిధంగా 20 వేల సీరియల్ సెట్స్, 10 వేల ఫ్లడ్ లైట్లు, 350 రంగురంగుల లైట్లు, 40 జనరేటర్లు, తోరణాలు, నైన్ వాట్స్ తోరణాలతో ఒంటిమిట్ట అంతా ప్రకాశవంతంగా మారి భక్తులకు కనువిందు చేయనుంది.
ప్రత్యేక ఆకర్షణగా కల్యాణ వేదిక
ఏప్రిల్ 01న జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంను వీక్షించేందుకు వేలాది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో, వారి సౌకర్యార్థం కల్యాణ వేదిక పరిసరాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతం మరియు ఆలయ పరిసరాల్లో 23 ఎల్.ఈ.డి వీడియో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని కనులారా వీక్షిస్తూ భక్తి పరవశంలో తేలియాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం. రవిచంద్ర, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ఆదేశాలతో ఎలక్ట్రికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్.ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి, డిప్యూటీ ఈఈ శ్రీ మురళీకృష్ణ తదితర అధికారులు, సిబ్బంది విద్యుత్ అలంకరణలను సిద్ధం చేస్తున్నారు.
No comments :
Write comments