ఒంటిమిట్టలో
శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేశామని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. కల్యాణ వేదిక వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ తో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ, భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని సంతృప్తిగా సందర్శించేలా గ్యాలరీలు ఏర్పాటు చేశామని, తలంబ్రాలు, శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదాలు అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అందరూ సంయమనంతో క్యూ పద్దతిలో ప్రసాదాలను స్వీకరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృతంగా సేవలు అందిస్తున్నారని అన్నారు, అదేవిధంగా, జిల్లా యంత్రాంగం, టిటిడి అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పటిష్ట చర్యలు తీసుకున్నారని చెప్పారు.
శ్రీ కోదండరామ స్వామి ఆలయం, ఒంటిమిట్ట పరిసరాల్లో, కల్యాణ వేదిక వద్ద విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. భక్తులు అందరూ క్యూ పద్దతిలో కల్యాణ వేదికకు చేరుకోవాలని, కల్యాణం అనంతరం అదే పద్దతిలో తిరిగి వెళ్ళాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సివీఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ, జిల్లా యంత్రాంగం, టిటిడి అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments