శ్రీవారి
సేవ కార్యకలాపాలపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు సేవల కేటాయింపు, భక్తులకు సేవలు అందించే విధానంపై ముందస్తు శిక్షణ, సంబంధిత విభాగాల సిబ్బంది సేవకులతో నడుచుకోవాల్సిన విధానం, సేవకుల నుండి ఫిర్యాదులు అందితే తక్షణ పరిష్కారం వంటి అంశాలపై సమావేశంలో సమీక్షించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
• శ్రీవారి సేవకుల నుండి అత్యుత్తమ సేవలను భక్తులకు అందించడంలో భాగంగా సేవ అనంతరం సంబంధిత సేవకుల అభిప్రాయాలను, అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశం.
• సేవకుల పనితీరును సమర్థత ఆధారంగా రేటింగ్ చేసే విధానం పారదర్శకంగా అమలు.
• సేవకుల ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఫిర్యాదు నంబర్ ద్వారా తక్షణ పరిష్కార వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయం.
• సంబంధిత విభాగాలు సేవకులకు బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని, శ్రీవారి సేవకుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి.
• సత్సంగ కార్యక్రమాల్లో ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మిక వక్తలను ఆహ్వానించి సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు.
• తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో ఆచరణ నియమాలు, నైతిక, ఆధ్యాత్మిక విలువలను తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
• భక్తులు, సేవకులు, ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం హీలింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు.
• రిటైర్డ్ సీనియర్ అధికారులను శ్రీవారి సేవ పర్యవేక్షకులుగా వినియోగించే అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచన.
ఈ సమావేశంలో సీపీఆర్వో డాక్టర్ టి.రవి, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, శ్రీ సోమన్నారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ రమాకాంత్, పీఆర్వో (ఎఫ్ఏసీ) కుమారి నీలిమ, ఐటీ డిప్యూటీ జీఎం శ్రీ వెంకటేశ్ నాయుడు, అశ్వనీ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డి, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments