ఒంటిమిట్ట
శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలోని ప్రాచీన శ్రీ కోదండరామాలయాన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఇటీవల పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదం లభించినట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, దేవేంద్రుడు పాలించిన దేవతల రాజధాని అమరావతి స్ఫూర్తితో ప్రజల రాజధానిని అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రీరాముడు, శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు.
కళ్యాణ వేదిక వద్ద భారీగా తరలివచ్చిన భక్తజన సమూహం మధ్య జై శ్రీరామ్ నినాదాలు మార్మోగగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
No comments :
Write comments